ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

 ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ



సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ

            రా పురవీధుల గ్రాలగలదె
      మణిమయంబగు భూషణ జాలములనొప్పి
            ఒడ్డోలగంబున నుండగలదె
      అతి మనోహరలగు చతురాంగనల తోడి
            సంగతి వేడ్కలు సలుపగలదె
      కర్పూర చందన కస్తూరి కాదుల
            నింపు సొంపార భోగింపగలదె

గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర
       వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
       సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె
       జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము


ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి చూసుకో. అసలు నీకు సిగ్గనేది ఉంటే ఎక్కడన్నా పడి చావు. తొల్లింటి చూఱగలదె (చూఱ అంటే కొల్ల, దోచుకోవడం) – ఇంతకు ముందు లాగా ఇంకా కొల్లగొడదామనుకుంటున్నావేమో – ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం.


నర్తనశాల సినిమాలో ఘంటసాల గానం చేసిన ఈ పద్యం చాలామంది విని వుంటారు. భారతం విరాటపర్వం లోనిది ఈ పద్యం. కవి తిక్కన సోమయాజి. సందర్భం ఉత్తర గోగ్రహణ సమయంలో కురుసేనను కకలావికలం చేసి, దుర్యోధనుణ్ణి ఓడించి, అతని ఎదురుగా నిలిచి, అతన్ని ఉద్దేశించి అర్జునుడు ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ చెప్పిన మాటలు ఇవి.


చిత్రం : నర్తనశాల (1963)

సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

రచయిత : తిక్కన 

నేపథ్య గానం : ఘంటసాల 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్షత్రియపుత్రుడు చిత్ర సమీక్ష | Kshatriya Putrudu Movie Review

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)