క్షత్రియపుత్రుడు చిత్ర సమీక్ష | Kshatriya Putrudu Movie Review

క్షత్రియపుత్రుడు

ఓ సామాజిక పరిణామానికి అద్దం





భారతీయ సమాజంలోని పలు ప్రాంతాలు, సమూహాలు ఒకేసారి, ఒకేలా చట్టం, పాలనా వ్యవస్థలను అంగీకరించలేదు. అలాగని అవన్నీ నేరుగా విభేదించనూలేదు. వారి సామాజిక నేపథ్యంతోనో, అనూచానంగా వస్తున్న అలవాట్లతోనో, లేక రాజకీయ స్థితిగతులతోనో చట్టాలు నేరుగా విభేదిస్తున్న చోట వాటికి అమలు ఉండదు. అలాగని ఆ స్థితి యధాతథంగానూ నిలిచిపోయేదీ కాదు. క్రమంగా సాంఘిక, ఆర్థిక స్థితిగతులు మారుతున్న కొద్దీ ఆ సమాజపు నడవడిక చట్టం పరిధిని అంగీకరిస్తూపోతుంది. సమాంతర వ్యవస్థలు రాజకీయ బలంతోనో, ఆర్థిక స్థితిగతులతోనో మరేవైనా కారణాల వల్లనో ప్రజాస్వామ్య భారతమనే ఈ పెద్ద వ్యవస్థలోకి విలీనం అవుతూంటాయి. అటువంటి ఓ సమాంతర వ్యవస్థను బద్దలుకొట్టి ఓ ఊళ్ళోకి పాలన వ్యవస్థలు, చట్టం వంటివి ఎలా ప్రవేశించాయో చూపించిన సినిమా తెవర్ మగన్ (తెలుగు అనువాదంలో క్షత్రియపుత్రుడు).

సినిమా కథ ప్రకారం సినిమా నేపథ్యం గ్రామంలోనిది. ఆ ఊళ్ళో శతాబ్దాలుగా యోధజాతిగా, గ్రామానికి పాలకులుగా సాగుతూవచ్చిన తెవర్ కులస్తుల మధ్య అంతర్గత కక్షల నడుమ సినిమా సాగుతుంది. ఊరికి పెద్దలాంటి పెరియ తెవర్ (శివాజీ గణేశన్) కొడుకు శక్తివేలు (కమల్ హసన్) లండన్లో చదువు పూర్తిచేసుకుని ఊళ్ళోకి అడుగుపెట్టడంతో ప్రారంభం అవుతుంది. తాను ప్రేమించిన భానుమతిని (గౌతమి) తీసుకుని ఇంటికి వస్తాడు. అయితే ఈ కొత్తరకం పరిణామానికి పెరియ తెవర్ అంగీకారం దొరకదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని, ఆమె తండ్రి సలహాసూచనలతో మెట్రో నగరాల్లో చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ప్రారంభిద్దామన్నది శక్తివేలు ఆలోచన. అయితే అతని తండ్రి పెరియ తెవర్ ప్రశ్న మాత్రం – దానివల్ల మన ఊరికి ఒరిగేదేమిటి అన్నది. అది ఆయన దృక్పథం. తాము చేసే పనివల్ల తమ ఊరికేదైనా మేలు కలగాలి. ఊరు వదిలి వెళ్ళడం, ఊరికి పనికిరానిదేమైనా చేయడం ఆయన దృక్పథానికి విరుద్ధం. అలానే కొడుకు పెళ్ళి తారీఖు తప్ప అన్నీ నిశ్చయించుకుని అమ్మాయిని తీసుకుని రావడం కూడా అతనికి నచ్చే వ్యవహారం కాదు. ఇవి ఇలా వుండగా, పెరియ తెవర్ కుటుంబానికి,  అతని తమ్ముడు చిన్న తెవర్  కుటుంబానికి మధ్య తీవ్ర విభేదాలుంటాయి. చిన్నతెవర్ కొడుకు మాయ తెవర్ (నాజర్) దాయాదులపై కక్షకు నిలువెత్తు రూపంలా ఉంటాడు. పెరియ తెవర్ కుటుంబానికి నమ్మినబంటు అయిన ఎసాకిని (వడివేలు) బలవంతపెట్టి గ్రామం మధ్యలో మూయించిన ఆలయాన్ని తాళాలు బద్దలుకొట్టి తెరిపిస్తాడు శక్తివేలు. పెరియ తెవర్, చిన్న తెవర్ల మధ్య ఎవరికి ఉత్సవం ప్రారంభించే హక్కుందన్న విషయంగా జరిగిన గొడవల్లో ఆ గుడి మూయించేస్తారు. దాన్ని తమ అనుమతి లేకుండా తెరిచారన్న అక్కసుతో మాయతెవర్ మనుషులు మనుషులు ఎసాకి కుడిచేయి నరికేస్తారు, ఎసాకి వర్గం వాళ్లు  అలా చేసినవాళ్ళ గుడిసె తగులబెట్టించేస్తారు. ఇవన్నీ తెలిసిన శక్తివేలు గ్రామాన్ని, గ్రామప్రజల హింసాప్రవృత్తినీ అసహ్యించుకుంటాడు. అదే విషయాన్ని తండ్రితో ‘‘ఈ జంతువుల మధ్య బ్రతకలేను నాన్నా’’ అని తెగేసి చెప్తాడు. అయితే ‘‘వందల ఏళ్ళుగా ఇలాగే ఉన్నామనీ, సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం కోసం బలిదానం చేసే యువకులు రావాలంటే ముందుగా వచ్చిన మూడు వందల మందిలో మనవాళ్ళు(తెవర్లు?) ఉన్నారనీ’’ గుర్తుచేస్తాడు తండ్రి ‘‘ఇప్పటికిప్పుడు మారమంటే హఠాత్తుగా వాళ్ళలో మార్పురావడం ఎలాగనీ, అతను మార్చేందుకు ప్రయత్నం చేయాలని, అంతమాత్రాన వెంటనే మారరనీ’’ అంటాడు. ఈలోపు తానే చనిపోతే అని శక్తివేలు అంటే చనిపో, అయితే చనిపోయేవరకూ ప్రయత్నించు, నువ్వు వేసిన విత్తనం చెట్టై నువ్వే పళ్ళు తింటున్నావా? మనవడు తింటాడు. ఇదీ అంతే అంటాడు. ఇలా వారిద్దరి దృక్పథాలకు, అభిప్రాయాలకు మధ్య విభేదం ఎత్తిచూపే ఆ సన్నివేశం తర్వాత. అప్పటికప్పుడు వెళ్లిపోతానన్న శక్తివేలు, తండ్రి కోరిక మీద ఓ పదిరోజులు ఉండివెళ్ళేందుకు అంగీకరిస్తాడు. ఊళ్ళో వివాదం కారణంగా మూతబడ్డ గుడిని కలెక్టరు సాయంతో తెరిపిస్తాడు, చెరువుకి కరకట్ట కట్టించేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఇవన్నీ చేస్తూపోతూంటే అతని ఎదుగుదలకి ఈర్ష్యపడ్డ మాయతెవర్ (నాజర్) శక్తివేలు మనుషులను చంపించేందుకు కరకట్టకు బాంబు పెట్టి వందల మంది ప్రాణాలు తీస్తాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు శక్తివేలు మీద తీవ్రమైన ముద్రవేస్తాయి. తన కక్షను ఊళ్ళో జనాల మీదికి మలుచుకున్న మాయతెవర్ ఊరి నుంచి బయటకు పండిన పంట వెళ్లేందుకు అనువైన మార్గాన్ని తన మనిషి భూమిలోంచి వెళ్తోందన్న విషయాన్ని ఆసరాగా తీసుకుని కంచె వేయిస్తాడు. ఈ విషయమై జరిగిన పంచాయితీలో పెరియ తెవర్ ని పరాభవిస్తాడు. ఆ వివాదం తర్వాత ఇంటికివెళ్ళి గుండెనొప్పితో పెరియతెవర్ మరణిస్తాడు. తర్వాత ఆధునిక యువకుడు శక్తివేలు పంచె, తెల్లచొక్కా, మెళ్ళో కండువా, బారు మీసంతో మరో పెరియతెవర్లా మారతాడు. ఆపైన ఊరిని బాగా చూసుకోవాలనే ఆశయం వల్ల ఏమార్పులు ఏర్పడ్డాయి, అతని వివాహం ఏమైంది, చివరకు ఏ మార్పు తీసుకువచ్చాడు అన్నవి మిగతా కథలోని ముఖ్యాంశాలు.

కథా ప్రారంభం నుంచి చివరి వరకూ ఒకే గ్రామంలో సాగుతుంది. ఆ గ్రామంలో ఏర్పడిన మార్పులు, జరిగిన సంఘటనలు, ప్రభావితం చేసిన వ్యక్తుల చుట్టూ కథ అల్లుకుంటుంది. అలానే కథలో గ్రామంతో పాటుగా పాత్రగా నిలిచినది కులం. ప్రధానంగా తెవర్ కులస్తుల మధ్య సాగే ఇతివృత్తం ఇది. ఈ రెండు సాంఘిక వ్యవస్థలూ ఒక సాంఘిక వ్యవస్థగా నిలిపారు సినిమాలో. ఆ వ్యవస్థలో చట్టానికి, పాలనా వ్యవస్థలకు ప్రవేశం లేదు. ఉన్నా అది రాజమార్గం కాదు, అడ్డదారి. కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం పాక్షికంగా వ్యవహరిస్తూండేందుకు, పరిమిత స్థాయిలో ప్రవేశం, అంతే. పంచాయితీ, కక్షల ఫలితంగా ఏర్పడే హింస వంటివన్నీ అక్కడ  ఓ సామాన్య ధర్మంగా వర్తిస్తూంటాయి. అలాంటి వ్యవస్థను కదిలించి చివరకు ప్రజాస్వామీకరించడమూ, చట్టం-పాలన వ్యవస్థలు నెలకొనేలా చేయడం కథానాయకుడి అంతిమ లక్ష్యాలు అవుతాయి. ఈ విషయాన్న వివరించేందుకు సమాంతర వ్యవస్థలు, చట్టాన్ని లెక్కించకపోవడం వంటివాటికి వున్న సాధారణత వంటివి ఇక్కడ చెప్పుకోవాలి.

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణాలు విరివిగా చేసేవారు వేర్వేరు చోట్ల నియమాలు వేర్వేరుగా వర్తించడాన్ని తేలిగ్గా గమనించగలుగుతారు. ఈ రచయిత స్వయంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నోవిధాలుగా ప్రయాణాలు చేశారు. ఒడిశాలో కోస్తా ప్రాంతం కాక అటవీప్రాంతంలో చేసిన రైలు ప్రయాణంలో కొన్ని ప్రాంతాల్లో చేసిన ప్రయాణం వల్ల ఆ ప్రాంతంలో చాలామందికి రిజర్వేషన్ చేయించుకునే అలవాటు ఉండదనీ, జనరల్ టిక్కెట్టు జేబులో పెట్టుకుని నచ్చిన బెర్తులో పడుకుంటారనీ తెలిసివచ్చింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో రిజర్వ్ అయివున్నా అన్ రిజర్వ్డ్ జనం ఎక్కేస్తూండడం, వారిని దింపేందుకు రిజర్వేషన్ చేయించుకున్నవారికి ఓ బ్రహ్మవిద్యే. బీహార్లో అయితే తమ ఇళ్ళకు దగ్గరలో రైలు వున్నప్పుడు చైన్ లాగి దిగిపోవడం సినిమాల పుణ్యమా అని తెలిసినవిషయమే. ఇవన్నీ దక్షిణ మధ్య రైల్వేలోని కొన్ని జోన్ల ప్రాంతాల్లో అసాధ్యమే అనుకోవచ్చు. ఇలాంటివాటిని అంత ధైర్యంగా ఎలా చేస్తారని గమనిస్తే ఆ చట్టాలకు కొన్ని ప్రాంతాలవారు ఒడంబడకపోవడం, వారికి ప్రతినిధులైన ప్రజాప్రతినిధులకూ ఇదేమంత తప్పని అన్న భావన ఉండడం కనిపిస్తూంటాయి. ఇలా ఒక్కో ఆర్గనైజ్డ్ వయొలేషన్ ఆఫ్ లా వెనుకా కనిపిస్తూంటాయి. ఇలాంటివి ముఖ్యమైన చట్టాల విషయంలోనూ కనిపిస్తూంటాయి. ఇవి చాలావరకూ పెద్ద విషయాలుగా తోచకపోవడానికి ముఖ్యకారణం ప్రజల్లో వాటి పట్ల తీవ్రమైన వ్యతిరేకత లేకపోవడమో, అనధికార అంగీకారం ఉండడమో కారణాలు. ఈ విషయాలనే అంతకన్నా ప్రమాదకరమైన నేరాలు, పెద్ద చట్టాల విషయంలోనూ పరిశీలిస్తుంది ఈ సినిమా.

సినిమాలో శక్తివేలు గుడి తలుపులు తెరిపించినప్పటి నుంచీ ఆర్గనైజ్డ్ వయొలేషన్ ఆఫ్ లా కనిపిస్తూంటుంది. ముందుగా ఇసాకు చెయ్యి నరికేసినవాడి ఇల్లు ఇవతలివారు తగలబెట్టేసి వదులుతారు. ఇక్కడ రెండు కాగ్నిజబుల్ సీరియస్ అఫెన్సులు జరిగాయి కానీ ఎవరూ కంప్లెయింట్ ఇవ్వరు. ఎస్సై మాటలను బట్టి పోలీసులే నమోదుచేసుకున్నా వారికి సహకరించరు, సాక్ష్యం ఇవ్వరు. ‘‘నిన్ను నరికినవాణ్ణి నువ్వు చూశావా? పోలీసులకు చేశారా’’ అని శక్తివేలు అన్నప్పుడు ‘‘అయ్యయ్యో బాబుగారూ.. మనం అంత దూరం పోకూడదయ్యా. పోలీసులు, కోర్టులు అంటూ తిరిగితే మనకి న్యాయం జరగదయ్యగోరూ. ఒకటి పంచాయితీ, లేదా దెబ్బకి దెబ్బ. అంతేనయ్యా’’ అన్న ఎసాకు మాటలు దీనికి దర్పణం. అంతేకాక ఊరి నుంచి పంట ధాన్యం బయటకు తీసుకువెళ్ళే మార్గాన్ని చట్టప్రకారం దొరికే లొసుగులు చూసి కంచె వేయించి మాయతెవర్ మూయిస్తాడు. ‘‘రేపు పంచాయితీ పెట్టించు అక్కడే తేలుస్తాను’’ అంటూన్న పెరియతెవర్ కి శక్తివేలు ‘‘నాన్నా పంచాయితీ ఎందుకు? దీనికి కోర్టే కరెక్ట్’’ అన్నపుడు ‘‘కరెక్టో కాదో నువ్వా నాకు చెప్పేది, పంచాయితీయే పెట్టించు’’ అంటూ మాట కొట్టేస్తాడు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన పంచాయితీలో మాయతెవర్ ‘‘కోర్టులోనే తేల్చుకుందాం.. చట్టప్రకారం ఏం తేలుస్తారో అక్కడే చూసుకుందాం’’ అని మాయతెవర్ అన్న సందర్భంలో పెరియ తెవర్ మాట గుర్తించదగ్గది ‘‘కోర్టట కోర్టు. తెలియకుండా మాట్లాడకు.. ఒక్కసారి పంచాయితీ తీర్పు ఇచ్చిందంటే దాన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏం చేయలేదురా’’ అంటాడాయన. నిజానికి సుప్రీం కోర్టు ఈ పంచాయితీ తీర్పులకు ఏ గౌరవం ఇస్తుందో మనకు తెలియనిది కాదు. అయితే ఆ పాత్ర దాన్ని ఏ స్థాయిలో నమ్ముతోదన్నది ముఖ్యం. అయితే ఆ నమ్మకం అతనిదే కాదు ఊళ్ళో చాలామందిది, అందుకే అంతటి పంచాయితీలో నిఖార్సైన సత్యంలా దాన్ని మాట్లాడతాడు పెరియతెవర్. ఇదీ కోర్టులకీ, పోలీస్ స్టేషన్లకీ ఆ ఊళ్ళో గతించే తరంలో ఉన్న గౌరవం.

ఇలాంటి ఓ వ్యవస్థని దాని సమాంతర పాలననీ మార్చాలన్నది కథానాయకుడికి క్రమంగా లక్ష్యం అవుతుంది. సామాన్యంగా చాలామంది ఏ మార్పు అయినా వ్యవస్థలోపలి వ్యక్తుల నుంచే ప్రారంభమవుతుంది అంటూంటారు. కానీ అందులో నిజం ఉన్నా చాలా సందర్భాల్లో ఆ లోపలి వ్యక్తికి ప్రేరణ కొంతవరకూ బయటి నుంచి వుంటుంది, మరికొంత లోపలి నుంచి వుంటుంది. ఇది స్పష్టంగా ప్రతిపాదించాలంటే మహాత్మా గాంధీని ఉదాహరణగా తీసుకుంటే బావుంటుంది. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ బారిస్టరు అయ్యేందుకు లండన్ వెళ్ళిన గుజరాతీ. అక్కడ బారిస్టర్ పట్టా సంపాదించి టాల్ స్టాయ్ వంటివారి సిద్ధాంతాలనూ, సహాయనిరాకరణ మౌలిక ప్రతిపాదనలూ ఆకళించుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జాతివివక్ష విశృంఖల రూపాన్ని చూసి దానిపై తన ఆయుధాలతో పోరాడాడు. అలా 30-40 ఏళ్ళ విదేశీ అనుభవంతో భారతదేశానికి తిరిగివచ్చాడు. ఆయనలో అప్పటికే అటు పాశ్చాత్య స్వేచ్ఛాసిద్ధాంతాలూ, సహాయనిరాకరణ వంటి ఆయుధాలూ, తన సంస్కృతికి స్వంతమైన సత్యం, అహింస వంటి సూత్రాలు అన్నీ వున్నాయి. క్రమంగా వాటిని మెరుగుచేసుకుంటూ, తనను తాను మరింత స్వదేశీ చేసుకుంటూ తుదకు కొల్లాయి కట్టి, కర్ర చేపట్టి భారతీయుల్లో జాతీయతా భావాలను విస్తరింపజేయడంలోనూ, విస్తృతమైన ప్రజానీకం వద్దకు స్వాతంత్రానికి సంబంధించిన భావనలు తీసుకుపోవడంలోనూ విజయం సాధించి చివరకు దేశ స్వాతంత్రానికి కీలకమైన చోదకశక్తి అయ్యారు. ఇవే దినుసులూ సినిమాలో కథానాయకుని పాత్రలో కనిపించడం ఆసక్తికరం. కథానాయకుడు శక్తివేలు ఎంతగా గ్రామానికి చెందిన తెవర్ నో, అంతగానే లండన్ నుంచి తిరిగివచ్చిన యూకే రిటర్న్. అతనిలో రెండు లక్షణాలూ కలగలసివున్నాయి. విదేశాల్లో వ్యవహరించడమూ, చదువుకోవడమూ తద్వారా లభించిన భావజాలం అతనికి ఇక్కడ నడుస్తున్న సమాంతర వ్యవస్థపై వ్యతిరేకత తీసుకువచ్చాయి. అయితే మాటకు నిలవడం, ప్రజలకు, గ్రామానికీ మేలుచేయడం, ఊరివాళ్ల కష్టాన్ని తనదిగా భావించడం లాంటివన్నీ అతని తండ్రి నుంచి వచ్చాయి. వీటి మేలుకలయికగా అతను రూపొందాడు. తండ్రి చనిపోయాకా తను గ్రామాన్ని సరిదిద్దుకోవడం, అభివృద్ధి చేయడం లక్ష్యాలుగా స్వీకరించినప్పుడు ఊహించని విధంగా అడ్డపంచె, తెల్లచొక్కా, కండువా, పెద్ద పెద్ద మీసాలతో మరో నాయకునిగా మారిపోవడం కూడా ఆశ్చర్యకరంగా గాంధీ పోలికని బలపరుస్తుంది. ఇలాంటి ఓ వ్యక్తి మార్పు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతాడు.

ముందుగా కరకట్టపై బాంబుపెట్ట జనం ప్రాణాలను తీసినవాళ్ళలో ఒకణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాడు. ఒక్క సాక్షిని తీసుకురండి నేను ఏం చేయాలో అది చేస్తానన్న పోలీసుకు కొన్నాళ్ళకే సమాధానంగా ‘‘వీడు కరకట్ట పేల్చాడనడానికి నేను సాక్షిని నా కంప్లైంట్ తీసుకోండి’’ అంటాడు శక్తివేలు. అది మొదలు గ్రామంలో కక్షలు, వివాదాల కారణంగా మూసేసిన కోవెలను కలెక్టరు ఆర్డరు మీద తెరిపించడం రెండో మెట్టు. అలా రాచమార్గంలోనే చట్టం, పాలనవ్యవస్థ వంటివి సక్రమంగా రావడం ప్రారంభమవుతాయి ఊళ్ళోకి. దీన్ని సమాంతర వ్యవస్థకు negative extreme అయిన మాయతెవర్ సహించలేకపోతాడు. రక్తపాతం సృష్టించడం, జనాన్ని తిప్పలు పెట్టడం లాంటి వాటి ద్వారా పైచేయికి ప్రయత్నిస్తారు. ఊరిజనం పంట బయటకువెళ్లేందుకు దగ్గరి దారిలో కంచె తీయించేందుకు,  మనిషి   కూతుర్ని తన మనిషికిచ్చి పెళ్లిచేస్తానని మాట ఇస్తాడు శక్తివేలు. తీరాచూస్తే సమయానికి ‘‘పెద్దపెద్దవాళ్లతో గొడవపెట్టుకునేందుకు ధైర్యం చేయలేను. సెలవం’’టూ వెళ్ళిపోయిన పెళ్ళికొడుకు బదులుగా తాను పెళ్ళిచేసుకుంటాడు ఆ అమ్మాయిని. ఆ ఒక్కపనితో ఒకపక్క తన తండ్రి నమ్మిన విలువ అయిన మాట తప్పకపోవడం నిలబెట్టడంతోపాటుగా, తనకూ పట్టణాల్లో వేరే జీవితానికి మిగిలిన చివరి లంకె అయిన ప్రేయసి కూడా తెగిపోతుంది. చివరకు తాను నమ్మిన అహింసను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూంటే(నాజర్) నీలోని మృగాన్ని బయటకు రానివ్వు అంటూ తీసుకువస్తాడు. హఠాత్పరిస్థితిలో అతన్ని తల నరికేయడంతో తాను అనుకున్న విలువకు తానే దెబ్బతీసినవాడు అవుతాడు. అయితే తన బదులు వేరేవారు నేరాన్ని అంగీకరించి లొంగిపోవడానికి ఒప్పుకోక, చట్టానికి రాచమార్గం పరిచి తాను సంకెళ్ళు వేయించుకుంటాడు. ఊరివాళ్ళంతా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూండగా కన్నీళ్ళతో వాళ్ళకి నమస్కరిస్తూ రైల్లో సంకెళ్ళతో ప్రతి నమస్కారం చేస్తూ బయలుదేరతాడు తెవర్ మగన్.

సినిమాలో రైలు ప్రయాణాన్ని ఓ సంకేతంగా ఉపయోగించుకున్నారు. సినిమా ప్రారంభంలో కథానాయకుడు విదేశాల నుంచి తిరిగివచ్చేప్పుడు రైల్లోనే ఊళ్ళో దిగుతాడు. కానీ రావడమైతే వచ్చాడు కానీ వెళ్ళిపోయే ఉద్దేశంతో వస్తాడు. అలానే సినిమా ముగింపులో రైల్లోనే జైలుకు తరలివెళ్తాడు. ఐతే వెళ్ళడమైతే వెళ్తుంటాడు కానీ తిరిగివచ్చే ఆశతోనే వెళ్తాడు. కథ మొదటినుంచీ చివరి వరకూ కనీసం చిన్న సౌలభ్యం కోసం కూడా కథాస్థలాన్ని ఆ ఊరినుంచి మార్చలేదు దర్శకుడు. అన్నివిధాలుగానూ ఆ ఊరి కథ చెప్పడంతో అలా కథ రాసుకున్నాడని నా అంచనా. ఇక ముందునుంచి వెనక్కి వేసుకునే కండువా, తెల్ల చొక్కా, తెల్ల అడ్డపంచె, బుంగ మీసాలతో ఉండే ఆహార్యం కూడా చాలా బలమైన సంకేతంగా వాడుకున్నాడు. మొదట అదే ఆహార్యంతో మనకు పెరియతెవర్(శివాజీ గణేశన్) కనిపిస్తే అతని మరణానంతరం అదే ఆహార్యాన్ని కొడుకు స్వీకరిస్తాడు. ఇది గ్రామం బాధ్యతని, తండ్రి ఆశయాలను స్వీకరించాడన్నందుకు సంకేతం.

ఇలా ఓ సామాజిక రాజకీయ పరమైన మార్పును కళాత్మకంగా చూపుతూ సినిమా తీశారు. చట్టంలోకి ఇతర వ్యవస్థల విలీనమనే ఈ ప్రక్రియను ఆ గ్రామం 1980ల్లో చేసినట్టు చూపించారు. అయితే దేశంలోని అనేకానేక వ్యవస్థలు అలా విలీనం కావడం వేర్వేరు కాలరేఖల్లో జరిగివుంటుంది. అలా ఇది మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు దర్పణం, అలానే ప్రతి ఊరి కథ, ప్రతివారి కథ.

విశేషాలు:

ఈ సినిమాలో వచ్చే మురిసేపండుగపూటా అనే పాటకు ఇళయరాజా కేవలం ఘటముతో సంగీతాన్ని అందించారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)