అవే కళ్ళు చిత్ర సమీక్ష | Avekallu (1967) Movie Review | Superstar Krishna

 అవే కళ్లు’ (1967) Suspence movie


బ్లాక్ అండ్ వైట్‌లో క్రైమ్ పిక్చర్స్ చాలా వచ్చాయి కానీ కలర్‌లో రూపుదిద్దుకొన్న తొలి తెలుగు క్రైమ్ చిత్రంఅవే కళ్లు’. తెలుగులో హీరో కృష్ణతో, తమిళంలోఅదే కనగళ్పేరుతో రవిచంద్రన్ హీరోగా రెండు భాషల్లో ఏకకాలంలో నిర్మించింది ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ.  చిత్ర నిర్మాణ బాధ్యతలు .వి. మెయ్యప్పన్ స్వయంగా పర్యవేక్షించేవారు.

నటీనటులు:
కృష్ణ, కాంచన, గుమ్మడి, రాజనాల, పద్మనాభం, రామదాసు, రమణారెడ్డి, నాగభూషణం, రామచంద్రరావు, ఆనందమోహన్, గీతాంజలి, పుష్పకుమారి, నిర్మల, కనకం, విజయశ్రీ, సాధన, లక్ష్మి.

సాంకేతిక నిపుణులు:
మాటలు: డి.వి. నరసరాజు, పాటలు: దాశరథి, కొసరాజు; సంగీతం: వేదా, ఫొటోగ్రఫీ: ఎస్. మారుతీరావు, కళ: .కె.శేఖర్, కూర్పు: ఆర్.జి.గల్, సహ నిర్మాతలు: ఎం. మురుగన్, ఎం. శరవణన్, ఎం. కుమరన్; నిర్మాత: .వి. మెయ్యప్పన్, కథ-దర్శకత్వం: .సి. త్రిలోకచందర్.
కృష్ణకు ఇది రెండో రంగుల చిత్రం. ఏవిఎం సంస్థలో తొలి సినిమా. రోజుల్లో ఆర్టిస్టులు కాలేజీకి వెళ్లినట్లు రోజూ స్టూడియోకు వెళ్లి రిహార్సల్స్‌లో పాల్గొనాల్సిందే. కృష్ణకు ఇది పదో చిత్రం. అయినాసరే ప్రతిరోజూ వెళ్లి రిహార్సల్స్‌లో పాల్గొనేవారు. డైలాగ్స్, ఫైట్స్, డాన్స్ ప్రాక్టీసు జరిగేవి. సినిమాలో క్లబ్ డాన్సర్ పాత్ర పోషించారు కృష్ణ. ఈస్ట్‌మన్ కలర్, భారీ సెట్స్, సస్పెన్స్ థ్రిల్లర్, మంచి పాటలు, ప్రముఖ తారాగణం.. ఇలా మెరిట్స్ చాలా ఉన్నాయి. అందుకే తొలిసారిగా సాధారణ విజయమే పొందినా, తరువాత విడుదలైన ప్రతిసారీ బాగా ఆడింది.

స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ దాకా ప్రేక్షకుడు అవే కళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు
మిస్టరీ ఈజ్ వెరీ గ్రిప్పింగ్కానీ
ఈ సినిమా చూస్తే ఒక్కటే ప్రాబ్లం
నిద్ర పట్టదని అనుకుంటున్నారా?
చీకటంటే భయమేస్తుందనుకుంటున్నారా?
డోరు కిర్రుమన్నా, కిటికీ కటక్కుమన్నా పైప్రాణాలు హుష్‌కాకి అనుకుంటున్నారా?
అందరి కళ్లల్లో ఒక హంతకుడు కనబడతాడేమో అనుకుంటున్నారా?
అనుమానం పెనుభూతమై వెంటాడుతుందని అనుకుంటున్నారా?

అది నిజమేనండోయ్ ... నేను నా చిన్నప్పుడు ఈ చిత్రం చుసిన తరువాత చాల రోజుల వరకు నా చుట్టూ పక్కల అన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించడం ఒక అలవాటు గా అయ్యింది..
అయినా కూడా చిత్రాన్ని బాగా …. ఎంజాయ్ చేస్తారు

చిమ్మ చీకట్లో రెపరెపలాడుతున్న దీపంలా ఉంది ఆ బంగళా. ఆ బంగళాలో మిగిలి ఉన్న ప్రాణాలూ కొద్దిరోజులుగా రెప రెపలాడుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రాణం ఆరిపోతుందో తెలియదు. కానీ ఆరిపోక తప్పదని మాత్రం ఆ ఇంట్లోని ఒకరికి ఖాయంగా తెలుసు. ఆ ఒక్కరు కాంచన . కాంచనతో పాటు ఇంకో వ్యక్తికి కూడాగాలిలో కలవబోయే ఆ ప్రాణాల గురించి తెలుసు. అతడెవరో కాదు, ఆ ఇంటి వాళ్లను ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్న హంతకుడు! ఎవరా హంతకుడు? ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తున్నాడు. అసలు అతడు ఇంట్లోని వాడా? ఇంటి బయటి వాడా? ఇంటికి వచ్చిపోతున్నవాడా? ఎవరికీ తెలీదు.

మరి కాంచనకు ఎలా తెలిసింది? ఈ హత్యల్లో ఆ అమ్మాయి ప్రమేయం ఉందా? భాగస్వామ్యం ఉందా? లేదు. పాపం అసలా అమ్మాయికి ఏ పాపమూ తెలియదు. మద్రాసులో చదువుకుంటూ సెలవులకని ఫ్రెండ్స్ రేణుక, సాధన, విజయ, లక్ష్మిలను వెంటేసుకుని వచ్చింది. వచ్చీరాగానే పిన్నిని వితంతువుగా చూసి నిశ్చేష్టురాలవుతుంది. ఆమె భర్తను ఎవరో హత్య చేశారని తెలిసి చిగురుటాకులా వణికిపోతుంది.

ఆ వణుకు అక్కడితో ఆగదు. సినిమా చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఆ అజ్ఞాత హంతకుడు ఆమెకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో చెబుతుంటాడు! సినిమాలోని డ్రామా అంతా ఈ ఫోన్ కాల్స్ మధ్యే సాగుతుంటుంది.

మొదటి కాల్

‘‘సుశీఫోన్ పెట్టేస్తావా!.. కాస్త ఆగమ్మా. శుభవార్త చెబుతాను. అది విని పెట్టేద్దువుగానీ’’

‘‘ఎవరు నువ్వుఎవరు నువ్వు…’’

‘‘తొందరపడకమ్మాసమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే నేనెవర్నో. నీ తండ్రి చూశాడు నన్నుచావడానికి ఒక్క నిమిషం ముందు. నీ బాబాయీ అంతే. నన్ను చూశాకే కన్నుమూశాడు. ఈసారి మీ ఇంట్లో నన్ను చూసే అదృష్టం ఎవరిదో తెలుసా? హా హా హాహా హా హా…’’

 

కాంచన భీతహరిణేక్షిణి అవుతుంది. ఏడాది క్రితం- తన తండ్రి కారు యాక్సిడెంట్‌లో పోలేదని, కారుకు యాక్సిడెంట్ చేసి ఆ హంతకుడే చంపేశాడని ఆమెకు అర్థమౌతుంది. అలాగే తన రెండో బాబాయి ఆత్మహత్య చేసుకోలేదని, అదే  హంతకుడు ఆయన్ని హత్య చేసి, ఉరి వేశాడని తెలుసుకుంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ కృష్ణ సహాయంతో అతడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆలోపే ఆ హంతకుడు ఆ బాబాయి భార్యనూ చంపేస్తాడు!

రెండో కాల్

‘‘సుశీఏదో అల్లరి పిల్లవులే అనుకున్నాను. చాలా గడుసుదానివి సుమా. నన్ను పట్టుకునే దాకా వచ్చిందా నీ సాహసం. అయితే ఇక నిన్ను విడువకూడదు. పోతావా మీ నాన్న దగ్గరికీఊ! హా హా హాహాహాహా…’’

గుండె చిక్కబట్టుకుంటుంది కాంచన. తన వారిలో ఎవరిని కాపాడుకోవాలో, ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతం అవుతున్న ఆ అమ్మాయిహంతకుడు తనను కూడా టార్గెట్ చేశాడని తెలిసి మరింత భయపడిపోతుంది. ఓ రోజు కాంచన, ఆమె ఫ్రెండ్స్ ఇంట్లో ఒంటరిగా ఉంటారు. పెద్దవాళ్లెరూ ఉండరు. రాజనాల పొరుగూరు వెళ్తాడు. ఆయన తమ్ముడు ఊళ్లోనే ఏదో పని మీద వెళ్తాడు. అదే సమయానికి కాంచన కోసం ఇంటికి వస్తాడు కృష్ణ. అప్పుడు వస్తుంది హంతకుడి నుంచి మరో కాల్.

మూడో కాల్

‘‘సుశీనీ పెద్ద బాబాయి ఊళ్లోనే లేడు. నీ చిన్న బాబాయి బార్లో ఉన్నాడు. నువ్వు ఈ వేళ ఒంటరిగా ఉన్నావు. పోమ్మా, పోయి ఇష్టమైనవన్నీ తిని, తయారుగా ఉండు. నేను ఇప్పుడే వస్తున్నాను. ఇదే నీ ఆఖరు’’ అని హెచ్చరిస్తాడు హంతకుడు.

ఆ రాత్రి కాంచనకు తోడుగా ఉంటాడు కృష్ణ. కానీ అందరి కన్నుకప్పి మరో హత్య చేస్తాడు ఆగంతకుడు. కాంచన రెండో బాబాయి హతుడౌతాడు. హంతకుడు కాపుగాసి మరీ, అతడు ఇంటికి రాగానే కత్తితో పొడిచి, పారిపోతాడు. కృష్ణకు అర్థమైపోతుంది. నెక్ట్స్ టార్గెట్ కాంచనేనని. ఇప్పుడేం చెయ్యాలి? హంతకుడిని ఎలా పట్టుకోవాలి? అప్పుడొస్తుంది మళ్లీ ఇంకొక కాల్.

చివరి కాల్

‘‘సుశీతప్పించుకు పోదామనుకున్నావా? ఎలాగైనా విజయం నాదే. ఇవాళ నీకు పెట్టిన గురి తప్పి, నీ బాబాయ్‌కి తగిలింది. హా హాహా…’’

కాంచన గజగజ వణికిపోతుంది. హంతకుడికి ఇంత పగేమిటి? ప్రతీకారం ఏమిటి? అన్నెంపున్నెం ఎరుగని వారందరినీ చంపడం ఏమిటి?

ఈ మిస్టరీని ఛేదించే సమయం ఆసన్నమైందని అనుకుంటాడు కృష్ణ.

 

అప్పటికి ఆ బంగళాలో ప్రాణాలతో మిగిలిన వారు రాజనాల, కాంచన మాత్రమే. మిగతావారు ఆ ఇంటివారు కాదు. ఆ ఇంటితో సంబంధం ఉన్నవారు. అప్పటికే రాజనాల పెద్దన్నయ్య, రెండో అన్నయ్య, ఆయన భార్య, రాజనాల తమ్ముడుఇలా వరుసగా ఒక్కొక్కర్నీ హంతకుడు చంపేసి ఉంటాడు. ఆ హంతకుడెవరన్నది సస్సెన్స్?

ఆ హంతకుడిని అందరికన్న ముందుకృష్ణ చూస్తాడు! వాడితో పోరాడుతూ.. చురకత్తి పదునున్న, పగతో రగులుతున్న, ప్రతీకారంతో జ్వలిస్తున్న ఆ కళ్లను చాలా దగ్గరగా చూస్తాడు.

ఇంతకీ ఆ కళ్లెవరివి?

అనేక రహస్యాలు రెండోప్రాణికి తెలియనివ్వని రాజనాలవా?

హత్య జరిగిన ప్రతిసారీ అక్కడే ఉంటున్న డాక్టర్ నాగభూషణానివా?

తోడబుట్టకపోయినా, సొంత సోదరునిలా మెలిగే రామయ్య తాతవా?

కర్కశత్వం మూర్తీభవించిన డ్రైవరువా?

ఎప్పుడూ చేత్తో కత్తి పట్టుకుని తిరిగే వంటవాడు రమణారెడ్డివా?

కాంచనను ప్రేమించి, ఆ బతుకులో భాగస్వామి కాగోరే కృష్ణవా?

లేక

హత్య జరగ్గానే పారిపోయి కనుమరుగయ్యే అజ్ఞాత యువతివా?

వీరందరిలో ఆ కళ్లుఎవరివి?

క్లైమాక్స్

ఆ కళ్లు ఎవరివో కాంచన పుట్టినరోజు నాడు బయట పడుతుంది. ఓ ఆగంతకుడు బాల్కనీలోకి చొరబడి, హాల్లో కేక్ కట్ చేయబోతున్న కాంచనకు గురిపెట్టి తుపాకీ పేల్చుతాడు. అది మిస్ అవుతుంది. అంతా ఆగంతకుడిని వెంబడిస్తారు. అతడు బంగళా బయటికి పరుగెత్తి అదృశ్యమైపోతాడు. ఈలోపు పొదల్లోంచి రామయ్య తాత మూలుగులు వినిపిస్తుంటాయి. 

‘‘ఏమైంది తాతా?’’ అని అనడిగితే ఎవరో తనను తలపై బలంగా కొట్టి అటుగా పారిపోయాడని చెబుతాడు. ఈలోపు ఇన్‌స్పెక్టర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. కుటుంబ సభ్యులంతా ఒకచోటికి చేరుకుంటారు. ఎందుకా ఆగంతకుడు ఇలా వరస హత్యలకు పాల్పడుతున్నాడని ఆలోచనలో పడతారు. ఎవరైనా శత్రువులున్నారా అని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు.

అప్పుడు రాజనాల ఓ భయంకరమైన నిజాన్ని బయటపెడతాడు. తన తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉందని, ఆవిడకు ఒక కొడుకు కూడా ఉన్నాడని, పెద్దన్నయ్యకు అది ఇష్టం లేక తల్లీకొడుకులు ఇంట్లో ఉండగా ఆ ఇంటికి పెద్దన్నయ్య నిప్పు పెట్టాడని చెబుతాడు.

తండ్రి మరణించినప్పుడు ఆ కుర్రాడి వయసు 10 సంవత్సరాలు. తండ్రి మరణించి పదిహేను సంవత్సరాలయ్యింది. అంటే ఆ వ్యక్తికి ఇప్పుడు పాతిక సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి బతికి ఉండి (మంటల్లోంచి తప్పించుకుని) పగబట్టి ఉండవచ్చునని అనుకుంటారు.

ఈలోగాపగబట్టిన ఆ కళ్లను నేను చూశాను అంటాడు కృష్ణ. ఆ కళ్లను మళ్లీ ఒక్కసారి చూసినా గుర్తుపడతానంటాడు. ఒక్కొక్కరికి ముసుగు వేస్తూ కళ్లను పోల్చుకుంటూ ఉంటాడు. చివరికి అవేకళ్లు చూడగానే హంతకుడిని గుర్తు పడతాడు.

 

తన తల్లి మంటల్లో కాలిపోవడం చూసి ప్రతీకారంగా ఈ కుటుంబాన్ని సమూలంగా నాశనం చేస్తానని తల్లికి ప్రమాణం చేశాననీ, ఒక్కొక్కరిగా చంపాననీ, ఇంకా ఇద్దరే మిగిలి ఉన్నారని, ఒకటి రాజనాల, మరొకరు కాంచన అని చెబుతాడు హంతకుడు. ఆ తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోతుండగా గుమ్మడి వచ్చి రివాల్వర్‌తో కాల్చేస్తాడు. కృష్ణ సిఐడిగా వచ్చాడని గుమ్మడి చెప్తాడు.

లాస్ట్ సీన్‌లో అతడు ఇన్‌స్పెక్టర్ తుపాకీ తూటాకు నేల కూలి వీణపై పడ్డప్పుడు ఆ దృశ్యం ఎంతో హృద్యంగా ఉంటుంది. అమ్మ జ్ఞాపకాలను వదల్లేక, అమ్మలోనే ఐక్యమైన ఆ హంతకుడిని తలచుకుంటే అతడెంత హంతకుడైనా సరే జాలేస్తుంది.  

రాజనాల, వెన్నిరాడై నిర్మల మీద చెలిని చెంతకు పిలుచుకోపాటను చిత్రీకరించారు. సముద్రపు ఒడ్డున చిత్రీకరించిన ఈ పాటలో వెన్నిరాడై నిర్మల స్విమ్‌సూట్‌లో కనిపిస్తారు.

కృష్ణ నటించిన తొలి హారర్, సస్పెన్స్ మూవీ.

ఫస్ట్ రన్‌లో సినిమా పెద్దగా అనిపించలేదు. క్రమక్రమంగా ఊపు అందుకుంది.

పాటలన్నీ సూపర్ హిట్. మా ఊళ్లో ఒక పడుచుంది. దయ్యమంటే భలే భయమన్నదిఅనేపాటైతే సూపర్ డూపర్ హిట్.

కాంచన డాన్స్, కృష్ణ అందం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

పద్మనాభం, గీతాంజలి మధ్య కామెడీని దర్శకుడు సందర్భోచితంగా పండించారు. గీతాంజలి తల్లిగా కనకం చేశారు.

సంసారం చదరంగం లాంటి చిత్రాలు చేసిన ఎస్.పి.ముత్తురామన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్.

కాంచన అప్పటికే మంచి పేరున్న హీరోయిన్, కృష్ణ అప్పుడే ఇండస్ట్రీ లో నిలదొక్కు కుంటున్న యంగ్ హీరో  కనుక  ఆమె పక్కన డాన్స్ చెయ్యడానికి తడబడ్డాడట. ఆ తడబాటు కనిపించకుండా కాంచన ఆయన్ని కలుపుకుని పోయారట.

అద్దె ఇల్లు కోసం కృష్ణ, పద్మనాభం భార్యాభర్తల్లా నటిస్తారు. పద్మనాభం రోసీగా ఆడవేషంలో కనిపిస్తారు.

హీరోగా కృష్ణకిది 10వ చిత్రం.

ప్రతి పాత్ర మీదా ఓ అనుమానం క్రియేట్ చేస్తూ దర్శకుడు చూపిన ప్రతిభ భేష్ అనదగ్గది.

సినిమా కధ ప్రధాన బలం..సస్పెన్స్ ఎలిమెంట్.

ఇప్పుడంటే మనలో కొందరు  ఇన్ని సినిమాలు చూసిన తరువాత, ఇల్లాంటివి  ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసి …. సినిమాలో కిల్లర్ ఎవరు అనేది  గెస్ చేయగలమో గాని, అప్పట్లో సగటు ప్రేక్షకుడికి చాలా కష్టం అయ్యింది.

ఇక సినిమాలోనిమా ఊరిలో ఒక పడుచుంది..దయ్యం అంటే భయమన్నదిఅనే సాంగ్ చాలా పాపులర్.

ఇకఏంటది అందం”, “ఎవరు నీవారులాంటి సాంగ్స్ కొద్దిగా వెస్ట్రన్ మ్యూజిక్ టచ్ ఉంది, ముద్దులొలుకు చిన్నది పాట అప్పటి కుర్రకారుని అలరించాయి.

సినిమా ఇప్పటి యూత్ ని ఎంత వరకు అలరిస్తుందో  చెప్పలేను గాని అప్పటి టెక్నికల్ వర్క్ ని  ఫీల్ అవటానికి తప్పక చూడవలసిన అల్ టైం క్లాసిక్ సస్పెన్స్  చిత్రం.


***********




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)