సన్ ఆఫ్ సత్యమూర్తి | చిత్ర సమీక్ష | Review of Son of Satyamurthy (2015)

సన్ ఆఫ్  సత్యమూర్తి

– Pious Obligation Of A Son





ఒక మనిషి అప్పు తీసుకుని, తీర్చకపోవటం చట్టం దృష్టిలో నేరమే కాదు, దేవుడి దృష్టిలో పాపం కూడా. అలా ఎవరి దగ్గరైనా అప్పుచేసిన మనిషి అప్పు తీర్చకుండానే చనిపోతే ఆ పాపం వలన అతనికి స్వర్గంలోకి ప్రవేశం ఉండదు కాబట్టి, తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి తప్పించే వాడే కొడుకు కాబట్టి ఆ అప్పు తీర్చి, తండ్రిని పాపవిముక్తుడ్నిచేసే “పవిత్రమైన బాధ్యత”ను (Pious Obligation) కొడుక్కి అప్పగించింది Family Law .. తండ్రి ఆస్తుల మీద హక్కే కాదు అప్పులకు బాధ్యత కూడా కొడుకు తీసుకోవటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం… Pious Obligation కేవలం అప్పులకు సంబంధించినదే కాదు తండ్రి చేసిన పాపం, పుణ్యం అన్నిటిలో బాధ్యతా తీసుకోవటమే..

అలాంటి ఒక పవిత్రమైన బాధ్యతను నిర్వర్తించిన ఒక మంచి కొడుకే విరాజ్ ఆనంద్ S/Oసత్యమూర్తి. విలువలే ఆస్తి గా బ్రతికే తండ్రికి తగిన కొడుకు. అందరిలాగా మానాన్న నాకు అనుభవించటానికి బోల్డంత ఆస్తి ఇచ్చాడు అనకుండా బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు అంటాడు. అలా అనటమే కాదు అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయిన తండ్రి బాధ్యతల్ని కూడా బాధతో కాకుండా ఆనందంగానే స్వీకరిస్తాడు.

తండ్రి చనిపోయేనాటికి ఆస్తులు,అప్పులు సమానంగా ఉన్నాయి. IP పెట్ట మన్న కొందరి సలహాని కాదని తన తండ్రిని ఎవరు గుర్తు పెట్టుకున్నా గొప్పవాడిగానే గుర్తుంచుకోవాలని అప్పుల్ని తీర్చేసి, తల్లి, మతిస్థిమితం లేని అన్న, వదిన వాళ్ళ పాపతో కుటుంబ బాధ్యత మొత్తం తనొక్కడే తీసుకుని చిన్న ఇంటికి మారిపోతాడు. ఇక అక్కడి నుండి జీవితం కోసం పోరాటం మొదలు పెడతాడు విరాజ్. వెడ్డింగ్ ప్లానర్ గా వెళ్లి, అక్కడ సమంత పరిచయం అయ్యి, ప్రేమించి, తన తండ్రి మీద గొడవల్లో ఉన్న ఆస్తి అమ్మాడన్న నిందని తొలగించటానికి తమిళనాడులో రౌడీ ఉపేంద్ర దగ్గరికి వెళ్లి, ప్రాణాలకు తెగించి మరీ అక్కడ తను అనుకున్నది సాధించటమే కధ…

సినిమాలో కొన్ని పాత్రలు మనం నిజజీవితంలో చూసే ఎంతో మంది మనుషుల ఆలోచనా విధానాలని, వ్యక్తిత్వాలను కళ్ళముందుంచుతాయి.

నాన్నా పులి కధలో.. మూడోసారి కూడా పిల్లాడు పిలిచినప్పుడు తండ్రి వెళ్లి ఉంటే పిల్లాడు బ్రతికేవాడు కదా.! కొన్నిసార్లు మోసపోయినా దానివల్ల మంచి జరిగితే మంచిదే కదా.. అనే నాన్న క్యారెక్టర్ ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మళ్ళీ ఎదుటివాళ్ళకి సహాయం చేయగల మంచి మనసున్న మనుషుల్ని గుర్తుచేస్తుంది.

“ భార్యంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలంటే మొయ్యాలనిపించే బరువు“ ఎంతో ఇష్టపడి ఇంటికి తెచ్చుకునే భార్య, కోడలు ఎలా ఉండాలో సింధుతులాని పాత్ర అలాగే ఉంది. పిచ్చి భర్త, అప్పులపాలైన అత్తగారి ఇల్లు వదిలి రమ్మని తండ్రి అడిగినా వెళ్ళకుండా, తన నగలు కూడా ఇచ్చేసి, కష్టాల్లో బాధ్యతల్లో పాలుపంచుకుని, మంచి భార్య, కోడలు అంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది.

నేను ఒకప్పుడు మా వాళ్లకి ఉద్యోగం కోసం వస్తే మీ నాన్న కుదరదు అన్నాడు, అప్పట్లో మీకు డబ్బుందని గర్వం ఉండేది అనే ఇంటి ఓనర్.. ఒకప్పుడు తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నీకోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని మాటలతో హింసిస్తూ ఆనందించే మనషుల ప్రవర్తనని చూపిస్తుంది.

అన్న కూతురి స్కూల్ ఫీజ్ కోసం ఫ్రెండ్ దగ్గర హెల్ప్ కోసం వెళ్తే వెడ్డింగ్ ప్లానర్ గా పంపిన ఫ్రెండ్ మంచితనం గురించి గొప్పగా ఫీల్ అయ్యేలోపే, తనతో ఎంగేజ్ మెంట్ జరిగి, తన తండ్రి చనిపోయి, ఆస్తులు పోవటం వలన ఆగిపోయిన అమ్మాయి పెళ్లి అని, కావాలనే అక్కడికి తనని పంపిన ఫ్రెండ్ ని చూస్తే, మన పక్కనే ఉంటూనే సమయం చూసి, దెబ్బకొట్టాలనుకునే ఇలాంటి శాడిస్ట్ మనుషుల్ని మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసిన జ్ఞాపకం తప్పకుండా వస్తుంది.

తమ్ముడి కూతురి పెళ్ళికి వచ్చి, తమ్ముడు తనని మోసం చేసి ఆస్తి ఎలా తీసుకున్నాడో చెప్పే ఎమ్మెస్ నారాయణ ప్రస్తుత కాలంలో సొంత అన్నదమ్ముల చేతిలో మోసపోయి, ఆస్తులు పోగొట్టుకుని వీధుల్లో పడుతున్న ఎంతోమందికి ప్రతిరూపంలా అనిపించాడు.ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్ళని పిచ్చివాళ్ళని చేయటానికి, అవసరమైతే చంపటానికి కూడా వెనుకాడని కొందరు మనుషులు గుర్తొచ్చారు.

గెలుపంటే పెద్ద పెద్ద కార్లు, ఆస్తులు, అంతస్తులు సంపాదించటమే కానీ విలువలు అంటూ అన్నీ కోల్పోయి, వీధుల్లో తిరగటం కాదని గట్టిగా నమ్మే వ్యక్తి రాజేంద్రప్రసాద్. తండ్రి అప్పుల కోసం ఆస్తులు వదిలేసిన హీరోని ఎగతాళి చేస్తుంటాడు. వాళ్ళు మాత్రమే గొప్ప అనుకుని, ఎదుటి వాళ్ళని అసమర్ధులు అనుకునే ఇలాంటి వాళ్ళని మన చుట్టూ చాలా మందిని చూస్తుంటాము.

లైఫ్ లో పట్టుకోవటం గొప్పా, వదిలేయటం గొప్పా? గెలవటం గొప్పా, వోడిపోవటం గొప్పా? అన్న రాజేంద్ర ప్రసాద్ మాటలకి “రావణాసురుడు సీతని పట్టుకుని రాముడి చేతిలో చచ్చాడు, వదిలేసుంటే బతికుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, యుద్ధంలో పోయారు అదే జూదంలో ఓడిపోయ్యుంటే హాయిగా బ్రతికిపొయ్యే వాళ్ళు. కాబట్టి కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదలటం, గెలవటం కంటే ఓడిపోవటం మంచిది ” అని చెప్పే మాట నిజమే కదా మన పురాణాల్లో ఉన్నగొప్పనీతిని చాలా ఈజీగా, సింపుల్ గా చెప్పేశాడు అనిపించింది.

అందరితో మంచి అనిపించుకోవాలి అనుకునేవాళ్ళు భారతంలో కర్ణుడి లాగానే అందరికీ అన్నీఇచ్చేసి, ఏమీ లేకుండానే పోతారు అని రాజేంద్రప్రసాద్ అనే మాట కొన్నిసార్లు నిజమే కదా? అనిపిస్తుంది.

ఇంక ఉపేంద్ర గురించి తమిళనాడులో మహా ఘోరమైన, భయానకమైన రౌడీగా పరిచయం చేయబడినా అతని నటన, హావభావాలు అంత పెద్ద రౌడీలాగా ఏమీ లేడే అనిపించేలా ఉన్నాయి. భార్య స్నేహ మీద గౌరవం, ప్రేమతో మంచివాడిగా నటించే మంచి భర్త, చెల్లి కోసం తాపత్రయపడే మంచి అన్న.. మొత్తానికి మంచి విలన్ ఉపేంద్ర.

పాప పెద్ద టెడ్డీ అడిగితే, చిన్న టెడ్డీ అయినా సరే కొనివ్వటం, స్టేజ్ మీద షో చూడాలన్న పాప కోసం తను డాన్స్ వేయటం, వదినని టీజ్ చేశాడని పోకిరీని చితక్కొట్టటం, పాప స్కూల్ ఫీజ్ కోసం తనని పెళ్ళి చేసుకోబోయి, క్యాన్సిల్ అయిన అమ్మాయి పెళ్ళికి వెడ్డింగ్ ప్లానర్ గా వెళ్లి, నీకు బాధగా లేదా అంటే మా నాన్న పోయిన బాధ ముందు ఇదెంత అనటం, ప్రేమించిన అమ్మాయి కోసం, తండ్రి మీద ఉన్న చెడ్డ పేరు పోగొట్టటం కోసం ప్రాణాలకు కూడా తెగించటం ఇలా అన్నివిషయాల్లో తన వాళ్ళను, ముఖ్యంగా చిన్న పాపని సంతోషంగా ఉంచాలని తపన పడే హీరోని చూస్తుంటే చిన్నప్పటి నుంచి, ఇప్పటికీ కూడా మనకోసం చిన్నవైనా, పెద్దవైనా త్యాగాలు చేసే మన తమ్ముడు కానీ, అన్నకానీ తప్పకుండా గుర్తొస్తారు .. నాకు మా తమ్ముడు గుర్తొచ్చినట్లు 🙂 

నమ్మిన విలువల కోసం ఎంత కష్టాన్నైనా అనుభవించి, ఒక మంచి కొడుకు, తోబుట్టువు, స్నేహితుడు, భర్త, ముఖ్యంగా మంచిమనిషి అంటే ఇలా ఉండాలి అనిపించే ఇలాటి S/O సత్యమూర్తి లు చాలామంది ఉంటారు. గెలుపు, సంతోషం అనేవి ప్రతి మనిషి కోరుకుంటాడు, కానీ ఎవరికి ఎలాంటి గెలుపు సంతోషాన్ని ఇస్తుంది అనేది ఆ మనిషి మనసుకి సంబంధించిన విషయం. తండ్రి వదిలి పెట్టిన బాధ్యతల కోసం పోరాడుతూనే మా నాన్న లేకపోతే నేను జీరోనా అని ప్రశ్నించుకుని, కాదు I Am Some Thing అని ప్రూవ్ చేసుకున్న విరాజ్ ఆనంద్ కధ నాకు నచ్చింది.

బ్రతికుండగానే తీసుకున్న అప్పులు ఎగ్గొట్టటానికి, బాధ్యతల నుండి తప్పుకోవటానికి, అక్రమాస్తుల్ని కాపాడుకోవటానికి, తోడపుట్టిన వాళ్లకి ఇవ్వవలసిన ఆస్తుల్ని కూడా మాకే కావాలంటూ ఏళ్లతరబడి కోర్టుల్లో దావాలు నడుస్తున్న ఈరోజుల్లో, తండ్రి చస్తే మహా అయితే 2,3 నెలల్లో మర్చిపోవచ్చు కానీ కోట్ల ఆస్తి ఎన్నాళ్ళకి సంపాదించాలీ, ఆయనకీ మంచి పేరు ఉంటే ఏంటి? ఊరంతా తిడితే ఏంటీ? అనుకునే ప్రాక్టికల్ మనుషులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు.

తండ్రి చేసిన అప్పుల కోసం ఆస్తులు వదిలే కొడుకులు కూడా ఉంటారా? మరీ సినిమా కాకపోతే అనేది కొందరిసందేహం.. ఇంక ఈ సినిమా ఇంతకు ముందు చూసిన కొన్ని సినిమాల్లా అనిపించటాలు, సాధ్యాసాధ్యాలు ఇవన్నీ వదిలేస్తే వెనకటి రోజుల్లో వచ్చే “మంచి మనసుకు మంచి రోజులు” లాంటి సినిమాల్లాగా మంచి వాళ్లకి కొన్నాళ్ళు కష్టాలు వచ్చినా మళ్ళీ తప్పకుండా మంచి జరుగుతుందని, కొన్ని సార్లు కోట్ల విలువ చేసే డబ్బు కూడా చేయలేని గొప్ప పనులు మంచితనంతో సాధించొచ్చు అని చెప్పిన ఈ సినిమా, అల్లు అర్జున్ యాక్షన్, కొన్ని డైలాగ్స్, పాటలు నాకు నచ్చాయి.

రాజ్యం గెలిచినోడు రాజవుతాడు

రాజ్యం విడిచినోడే రామచంద్రుడు

యుద్ధం గెలిచినోడే వీరుడు శూరుడు

యుద్ధం విడిసోటేడే దేవుడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)