గోదాదేవి - తిరుప్పావై | 30 పాశురములు వాటి వివరణలు

 గోదాదేవి - తిరుప్పావై


భారతదేశంలో
 ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదాదేవి (ఆండాళ్) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది.


పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణుచిత్తుడనే ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది.విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ, గోదాదేవి భక్తి ఫలించి, రంగనాథుడు స్వప్నంలో గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దుల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే (పాశురాలే) ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు. (గోదాదేవి చేసింది కాత్యాయనీ వ్రతమని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలలో ఉంది.) తెలుగులోనూ ఈ పాశురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఉన్నారు. గొప్ప వైష్ణవ సాహిత్యమనేగాక, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన.

మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది.

తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి, ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు.

చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి.


చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.

 

మొదటి పాశురము: 

ఆండాళ్  గొల్ల భామలను, కాలాన్ని ప్రశంసిస్తూ, భగవాన్ మాత్రమే   మన అంతిమ లక్ష్యమని మరియు సాధనమని ప్రశంసిస్తూ, కృష్ణానుభవం పొందాలనే సంకల్పముతో మార్గళి నోముని పాటించాలని నిశ్చయించుకుంది.

మార్గళి త్తింగల్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిఱు మీర్గాళ్
కూర్వేల్ కొడుం తొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏర్ ఆర్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

ఓహో ! ఇది మార్గశీర్ష మాసము.వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా! ఇశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండు.ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి ఏ విధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడును, అందమగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాల సింహమును, నీలమేఘశ్యముడును, ఎఱ్ఱ తామరలపోలిన కన్నులు కలవాడును, సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే. ఆతనినే తప్ప వేరొకరిని అర్దించని మనకే , మనమపేక్షించు వ్రత సాదనమగు ‘పర’ అను వాద్యమును ఈయనున్నాడు.మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు మీరు అందరు వచ్చి ఈ వ్రతములో చేరుడు.


రెండవ పాశురము: 

కృష్ణానుభవంలో పాల్గొనేటప్పుడు చేయవలసిన పనులు  మరియు చేయకూడని పనుల జాబితాను ఆమె వివరిస్తుంది. భగవాన్ కి శరణాగతి చేసిన మనకు, పూర్వాచార్యులే మార్గదర్శకులు అని ఆమె వివరించింది.

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్ పావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పైయత్తు యిన్ఱ పరమన్ అడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మై యిట్టు ఎళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మాఱైణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

కృష్ణుడవతరించిన కాలములో ఈ లోకములో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచములో కూడ ఆనందమునే అనుభవించుచున్న వారలారా ! మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు. పాల సముద్రములో ధ్వని కాకుండా మెల్లగా పండుకొనియున్న ఆ పరమపురుషుని పాదములకు మంగళము పాడెదము. ఈ వ్రత సమయములో నేతిని గాని , పాలనుగాని మే మారగింపము.తెల్లవారు జాముననే లేచి స్నానము చేసెదము.కంటికి కాటుక పెట్టుకొనము, కొప్పులో పూవులు ముడువము. మా పెద్దలు ఆచరింపని పనుల నాచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలను , అసత్య వాక్యములను ఎచ్చోటను పలుకము. జ్ఞానాధికులను అధిక ధన ధాన్యాదులతో సత్కరించుచుందుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్ష నొసంగుచుందుము.మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసుకొందుము. దీని నంతను విని మీరానందింపగోరుచున్నాము.


మూడవ పాశురము:.

కృష్ణానుభవమును ఆస్వాదించడానికి ఆమెకు అనుమతి ఇచ్చిన   బృందావనములోని వారందరికీ ఆ యొక్క ప్రయోజనములు కలగాలని ఆండాళ్ ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరూ కృష్ణానుభవం పొందాలి అని అర్ధము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నమ్ పావైక్కు చ్చాఱ్ఱి నీరాడినాల్
తీంగిన్ఱి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్తములై పఱ్ఱి
వాంగ, క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

బలి చక్రవర్తి ఇచ్చిన దానము నంది ఆకాశము వరకు పెరిగి మూడు లోకములను తనపాదములచే కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్య నామములను గానము చేసి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగనే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతిబాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశమువరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళి పడుచుండగా , కలువ పూవులలో మనోహరములగు తుమ్మెదలు నిద్రించుచుండగా , సస్యములు సమృద్దములై యుండవలెను.పాలు పితుకుటకు కొట్టములో దూరి స్తిరముగా కూర్చుండి పొదుగునంటగనే పాలు కుండలు నిండునట్లు చేపు గోవులు సమృద్దముగా నుండవలెను. నశ్వరము కాని సంపద దేశమంతా నిండవలెను.


నాల్గవ పాశురము: 

ఆండాళ్ ఒక నెలలో మూడు సార్లు (బ్రహ్మణుల కొరకు, రాజు మరియు పవిత్రమైన స్త్రీల కొరకు) వర్షించాలని పర్జన్య దేవుడిని ఆదేశిస్తుంది, తద్వారా బృందావనములో ప్రజలు సంపన్నముగా జీవిస్తూ, కృష్ణానుభవమును పొందవచ్చు.

ఆళి మళైక్కణ్ణా  ఒన్ఱు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేఱి
ఊళి ముదల్వన్ ఉరువమ్ పోల్ మెయి కఱుత్తు
పాళియం తోళుడై పఱ్పనాబన్ కైయిల్
ఆళి పోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్ఱు అదిర్ న్దు
తాళాదే శార్ ఙ్గ ముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

గంభీర స్వభావుడా ! వర్ష నిర్వాహకుడా ! ఓ పర్జన్య దేవా ! నీవు దాత్రుత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపచేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి , ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము వలె శ్యామల మూర్తివై ఆ పద్మ నాభుని విశాల సుందరబాహు యుగళిలో దక్షిణ బాహువు నందలి చక్రమువలె మెరసి ఎడమ చేతిలోని శంఖమువలె ఉరిమి శార్ఙమను ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము.


ఐదవ పాశురము: 

ఎంబెరుమాన్ యొక్క దివ్య నామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని కర్మలు (పాప పుణ్యాలు రెండూ) మటుమాయమవుతాయని ఆండాళ్ చూపిస్తుంది. మన పూర్వ కర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి, భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరువలె అంటకుండా పోతాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశము ఏమిటంటే, మనము గతంలో చేసిన పాప కర్మలన్నీ ఎంబెరుమాన్ తొలగిస్తాడు. మనము భవిష్యత్తులో తెలియక చేయబోయే పాపములు కూడా తొలగిస్తాడు. కానీ, భవిష్యత్తులో తెలిసి చేసే పాప కర్మల ఫలితమును మాత్రము అనుభవించేలా చేస్తాడు.

మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయ పిళ్ళైయుమ్ ప్పుగు దరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్సంబంధముగల ఉత్తరదేశమునందలి మధురానగరికి నిర్వాహకుడును , పవిత్రము అగాధమునగు జలముగల యమునానది రేవే తనకు గురుతుగా కలవాడును , గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపము అయినవాడును,తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరుడైన వాడునునగు కృష్ణ భగవానుని వద్దకు పవిత్రులమై వచ్చి మనము పరిశుద్దములగు పుష్పములతో నర్చించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు , ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోవును.కావున భగవానుని నామములను పాడుడు.

ఈ విధంగా, మొదటి ఐదు పాశురముల ద్వారా, ఎంబెరుమాన్ యొక్క పర (శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణ), వ్యూహ (క్షీర సముద్రములోని శ్రీ మహావిష్ణువు), విభవ (త్రివిక్రముడు), అంతర్యామి (వరుణుని అంతర్యామియైన), అర్చ (వడమధుర యొక్క భగవాన్) స్వరూపాల గురించి వివరింబడింది.

 

ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురము వరకు, తిరువాయ్ ప్పాడి (శ్రీ గోకులం) లోని ఐదు లక్షల గొల్ల భామలను మేల్కొలపడానికి ప్రతినిధులుగా ఆండాళ్ పది మంది గోపికలను మేల్కొల్పుతుంది. ఆమె  నైపుణ్యము ఉన్న పది మంది భక్తులను మేల్కొలిపే విధానము బట్టి ఈ పాశురములు అమర్చబడ్డాయి.


ఆరవ పాశురము: 

ఇందులో, ఆమె కృష్ణానుభవానికి క్రొత్తదగుటచే ఈ వ్రత వైభవము తెలియక తానొక్కతియే తన భవనములో పరుండి వెలికి రాకుండా ఉన్న ఒక ముగ్ధను లేపుచున్నారు. భాగవంతుడిని అనుభవించడంలో ఇది ప్రథమ పర్వ నిష్ఠ (మొదటి దశలో ప్రవేశించడం). ఇతర భక్తులతో కలిసి ఉండాలని అర్థం చేసుకుంటే, అది చరమ పర్వ నిష్ఠ  (అంతిమ దశలో ప్రవేశించడం) అవుతుంది.

పుళ్ళుమ్ శిలుంబిన కాణ్ పుళ్ళ రైయన్ కోయిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టిలైయో
పిళ్ళాయ్ ఎళుందిరాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు అరియన్ఱ పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

ఆహారమును ఆర్జించు కొనుటకై లేచి పక్షులు కలకల లాడుతూ పోవుచున్నాయి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామి యగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సేవలకు సమయమైనది రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుట లేదా ! ఓ పిల్లా! లెమ్ము!. మేము ఎవరు లేపగా లేచితిమన్న సందేహము కలుగ వచ్చు. పూతన  యొక్క స్తనములందుండు విషమునారగించినవాడును అసూరావేషము కలిగి చంపుటకు వచ్చిన శకటమును కీలూడునట్లు, పాలకై ఏడ్చి కాలుచాచి పొడిపొడి యగునట్లు చేసినవాడును, క్షీర సముద్రములో చల్లని మెత్తని సుకుమారమైన ఆదిశేషునిపై లోకరక్షణ చింతతో యోగనిద్రలో ఉన్న జగత్ కారాభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయములో పదిలపరచుకొని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి-హరి-హరి యనుచుండు నపుడు వెడలిన పెద్దధ్వని మా హృదయములలో చొచ్చి, చల్ల పరచి మమ్ములను మెలకొల్పినది – నీవు కూడా లేచిరామ్ము.


ఏడవ పాశురము: 

ఇందులో, కృష్ణానుభవములో ప్రావీణ్యం ఉన్న ఒక గోపికను ఆండాళ్  మేల్కొలుపుతుంది. అయితే, ఈ గోపిక అండాళ్ మరియు ఆమె స్నేహితుల మధురమైన స్వరాన్ని వినడానికి తన ఇంటి లోపలే ఉంది.

కీశు కీశెన్ఱెంగుం ఆనై చ్చాత్తన్ కలన్దు
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో  పేయ్ ప్పెణ్ణే
కాశుమ్ పిరప్పుమ్ కలకలప్పక్కై పేర్తు
వాశ నఱుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర్ అరవమ్ కేట్టిలైయో
నాయక ప్పెణ్పిళ్ళాయ్  నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ తిఱ వేలో రెమ్బావాయ్.

భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుజామున కలిసికొని అన్ని వైపుల ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ద్వనినైననూ నీవు వినలేదా !

ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధము వేదజల్లుచున్న జుట్టు ముడులు గల గోపికలు, కవ్వముతో పెరుగును చిలుకుతుండగా, వారి చేతుల కంకణ ధ్వనులు, వారి మెడలో ఆభరణాల ధ్వనులతో ఆ శబ్దము విజృంభించి, ఆకాశమునంటుచున్నవి. ఆ ద్వనిని వినలేదా? ఓ నాయకులారా ! సర్వ పదార్దములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కన్పడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడు గా అవతరించి, విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కన్పట్టుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి యనుభవించునట్లు తలుపు తెరవవలయును.


ఎనిమిదవ పాశురము: 

ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది.

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు
మేయ్వాన్ పరన్దన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వన్దు నిన్ఱోమ్ కోదుకలమ్ ఉడైయ
పావాయ్  ఎళున్దిరాయ్ పాడి ప్పఱై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱునామ్ శేవిత్తాల్
ఆవావెన్ఱారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.

శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపికా! తూర్పు దిక్కున తెల్లవారుతున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. మిగిలిన గోపికలందరు కూడా వ్రత స్థలానికి బయలుదేరారు, అలా పోవుటయే తమకు ప్రయుజనమనునట్లు వెళుచున్నారు. ఆ పోయేవారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలుచున్నాము. కుతూహలము కలదానా – ఓ పడతీ ! లేచిరమ్ము!, కేశి అనే రాక్షసుడి చీల్చి వధించిన వానిని, కంసుని మల్లయోధులను చంపిన  వానిని,   నిత్యాసురులకు నాయకుడైన కృష్ణుడిని మనం వెళ్ళి ఆరాధిస్తే, అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాక్షించును .


తొమ్మిదవ పాశురము: 

ఇక్కడ, ఆమె శ్రీమహావిష్ణువు  మాత్రమే ఉపాయమని దృఢమైన నమ్మకము ఉండి, శ్రీమహావిష్ణువు  తో వివిధ మనోహరమైన రీతులలో వారిని  ఆస్వాదిస్తున్న గోపికను మేల్కోలుపుతుంది. ఈగోపిక “ శ్రీ రాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షిస్తాడు” అని హనుమంతుడి తో చెప్పిన సీతమ్మ లాంటిది.

తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్ అవళై యెళుప్పీరో? ఉన్ మగళ్ దాన్
ఊమైయో అన్ఱిచ్చెవిడో అనన్దలో
ఏమ ప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్ఱు ఎన్ఱు
నామమ్ పలవుమ్ నవిన్ఱేలో రెమ్బావాయ్

పరిశుద్దమైన నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖమైన శయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరు ధూపము గుమగుమలాడు చుండగా నిద్రపోవుచున్న అత్త కూతురా! మణి కావాటపు గడియ తీయుము. ఓ  అత్తా! నీవైనా ఆమెను లేపుము – నీ కుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక జాడ్యము కలదా? లేక ఎవరైనా కావలి ఉన్నారా ? లేక గాఢ నిద్ర పట్టు నట్లు మంత్రించినారా ? “మహా మాయావీ ! మాధవా ! వైకుంఠ వాసా!” అని అనేక నామాలను కీర్తించాము, కానీ ఆమె లేచినట్లు లేదు.

అని ఆండాళ్ అమ్మ ఆ గోపికను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది.

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

పదవ పాశురము: 

ఈ పాశురములో ఆండాళ్ శ్రీకృష్ణుడికి ప్రియమైన ఒక గోపికను మేల్కోలుపుతుంది. పరమాత్మని పొందటానికి అతనే మార్గమని ప్రగాఢమైన విశ్వాసముతో ఉంది, ఈ కారణంగా ఆమె శ్రీమహావిష్ణువు కి అతి ప్రియమైనది కూడా.

నోఱ్ఱు చ్చువర్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్
మాఱ్ఱముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాఱ్ఱత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోఱ్ఱప్పరై త్తరుమ్ పుణ్ణియనాల్ పణ్ణొరునాళ్,
కూఱ్ఱత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోఱ్ఱు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆఱ్ఱ అనన్దల్ ఉడైయాయ్ అరుంగలమే
తేఱ్ఱమాయ్ వన్దు తిత్తవేలో రెమ్బావాయ్

మేము రాకముందే నోము నోచి, దాని ఫలితముగా సుఖానుభవము పొందిన ఓ తల్లీ ! తలుపు తెరవక పోయినా, కనీసము మాటలైనా పలుకవా! పరిమళముతో నిండిన తులసి మాలలు ధరించి కిరీటముగల నారాయణుని  కారణముగా ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు, నిద్రలో నీచే  ఓడింపబడి తనసొత్తగు ఈ నిద్రను నీకు ఒసంగినాడా ! ఇంత ఆధికమగు నిద్రమత్తు  వదలని ఓ తల్లీ ! మాకందరికి  శిరో భూషణమైన దానా ! మైకము వదిలి వచ్చి తలుపు తెరువుము.

అని ఆండాళ్ అమ్మ ఆ గోపికను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది.

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

పదకొండవ పాశురము: 

ఇందులో, బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను నిద్ర లేపుతుంది. ఈ పాశురములో, వర్ణాశ్రమ ధర్మ అనుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడింది.

కఱ్ఱు క్కఱవై క్కణంగళ్ పలకఱన్దు
శఱ్ఱార్ తిఱల్ అళియచ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుఱ్ఱ మొన్ఱిల్లాద కోవలర్ తమ్ పొఱ్కొడియే
పుఱ్ఱరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుఱ్ఱత్తుతోళిమార్ ఎల్లారుమ్ వన్దు నిన్
ముఱ్ఱమ్ పుగున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిఱ్ఱాదే పేశాదే శెల్వప్పెండాట్టి  నీ
ఎఱ్ఱుక్కు ఱంగుమ్ పొరుళ్ ఏలోర్ రెమ్బావాయ్.

లేగ దూడలు గలవియు, దూడలవలే ఉన్నవియునగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుక గలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్దము చేయగలవారును, ఏ దోషము లేనివారును యగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగా ! పుట్టలోని పాము పడగవలే సన్నని నడుము గలదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలును మొదలగు అందరూ వచ్చిరి. నీ ముంగిట చేరిరి. నీలమేఘ వర్ణము గల శ్రీ కృష్ణుని నామములను కీర్తించు చుండిరి. అయినా కానీ నీవు ఉలుకక పలుకక ఉన్నావేమీ ? ఓ సంపన్నురాలా! నీ  నిద్ర అర్థమేమో తెలుపుము.


పన్నెండవ పాశురము: 

ఇందులో, ఆమె శ్రీకృష్ణుడి ఒక సఖుని యొక్క సోదారి అయిన ఒక గోపికను మేల్కోలుపుతుంది, శ్రీకృష్ణుడి యొక్క ఆ సన్నిహితుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడు, కానీ ఎంబెరుమాన్ యొక్క కైంకర్యంలో మునిగి ఉంటాడు.  ఏదేమైనా, అతను కైంకార్యం చేయడం పూర్తి చేసి, తన దినచర్యలను నిర్వహించడం ప్రారంభిస్తాడు.

కనైత్తిళం కఱ్ఱెరుమై కన్ఱుక్కిరఙ్గి
నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
ననైత్తిలమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడై పఱ్ఱి
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చెఱ్ఱ
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్

లేగ దూడలు గల  గేదెలు పాలుపితుకు వారు లేక వాటిని తలంచుకొని వానిపై మనసు పోవుట చే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తలిచి పాలు పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతా బురద ఆగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచి ఉంటిమి.  నీ ఇంటి ద్వారము పై కమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రావణుని చంపిన మనోభీరాముడగు శ్రీ రాముని గానము చేయుచుంటిమి. అది విని కూడా నీవు నోరు విప్పవా ! ఏమి గాఢ నిద్ర ! ఊరి వారికందరికును నీ విషయము తెలిసినది.


పదమూడవ పాశురము: 

ఇందులో ఆమె ఏకాంతంలో, తన కళ్ళ అందాన్ని మెచ్చుకుంటున్న ఒక గోపికను మేల్కోలుపుతుంది. కళ్ళు సాధారణంగా జ్ఞానాన్ని సూచిస్తాయి కాబట్టి, ఈ అమ్మాయికి ఎంబెరుమాన్ కి  సంబంధించిన విషయాలలో పూర్తి జ్ఞానం ఉందని చెప్పవచ్చు. శ్రీ కృష్ణుడు తనంతట తాను ఆమెను వెతుక్కుంటూ వస్తాడని ఆమె అభిప్రాయం. అరవిందలోచనుడైన శ్రీ కృష్ణుని  కళ్ళు ఆమె కళ్ళకి సరిపోతాయి.

పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లా అరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్కళమ్ పుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱంగిఱ్ఱు
ప్పుళ్ళుమ్ శిలుంబిన కాణ్, పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళ క్కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో? పావాయ్ నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్

పక్షి శరీరమును ఆవహించిన బకాసురుడి నోరు చీల్చిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని వధించిన శ్రీ రాముని గానము చేయుచుపోయి  మన తోడి పిల్లలందరూ వ్రత క్షేత్రానికి చెరినారు. తామరపూలను పోలిన కన్నులు గలదానా ! లేడి వంటి చూపులుగలదానా! గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు. పక్షులు కూయుచున్నవి. కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా స్నానమొనర్పక పాన్పుపై  పండుకొనియుండెదవేల? ఈ మంచి రోజున నీవు నీ కపటమును వీడి మాతో కలసి ఆనందము అనుభవింపుము.


పద్నాలుగో పాశురము: 

ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడాలేపెదనని చెప్పిన ఒక గోపిక మేల్కొలుపబడుచున్నది.

ఉఙ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెఙ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబిన కాణ్
శెంగల్ పొడిక్కూఱై వెణ్ పల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై  మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్ ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శంగొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పంగయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

ఓ పరిపూర్ణురాల! నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎఱ్ఱ తమరాలు వికసించినవి. నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి. ఎఱ్ఱని కాషాయములు ధరించి తెల్లని పలువరుస కలుగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన మొనర్చుటకు వెళుచున్నారు. లెమ్ము. మమ్మల్ని వచ్చి నిద్ర లేపుతానని మాట ఇచ్చితివి. మరచితివా! శంఖ చక్రమును ధరించిన వాడును, ఆజానుభాహువును, పుండరీకాక్షుని గానము చేయుటకు లేచిరామ్ము.


పదిహేనవ పాశురము: 

 పాశురములో, తన  భవనము వద్దకు వస్తున్న ఆండాళ్ ని మరియు ఆమె స్నేహితులను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్న  ఒక గోపికని మేల్కొలుపుతున్నారు.

ఎల్లే ఇలంగిళియే  యిన్నమ్ ఉరంగుదియో
శిల్లెన్ఱు అళైయేన్మిన్ నంగైమీర్ పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కత్తురైగళ్ పణ్డే ఉన్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానేదాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుమ్ పోన్దారో పోన్దార్ పోన్దు ఎణ్ణిక్కొళ్
వల్లానై కొన్ఱానై మాఱ్ఱారై మాఱ్ఱు అళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.

ఈ పాశురమునలో లొన ఉన్న గోపికకు బయటి గోపికకు సంవాదము నిబంధింపబడినది .

బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కాలదానా ! ఇంకనూ నిద్రించుచున్నావా ! అయ్యో ఇది ఏమి ?

లోని గోపిక: పూర్ణులగు గోపికలరా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకూడదు. నేనిదే వచ్చు చున్నాను.

బయటి గోపికలు: నీవు చాలా నేర్పుగల దానవు నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే ఎరుగుదుము.

లోని గోపిక: మీరే నేర్పుగలవారు, పోనీలే, నేనే కఠినురాలను.

బయటి గోపికలు: నీకీ ప్రత్యేకత ఏమి ? అలా ఏకాంతముగా నుండెదవేల? వేగముగా వెలికి రమ్ము.

లోని గోపిక: అందరు గోపికలును వచ్చిరా ?

బయటి గోపికలు: అందరూ వచ్చిరి. నీవు వచ్చి లెక్కించుకొనుము.

లోని గోపిక: సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?

బయటి గోపికలు: బలిష్టమగు కువలయాపీడము అను ఏనుగును చంపిన వాడును, శత్రువుల దర్పమును అణచిన వాడను, మాయావి అయిన శ్రీ కృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.

పదహారు మరియు పదియేడవ పాశురములలో, అండాళ్ ఈ సంసారమును, నిత్యసూరుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను, ద్వారపాలకులను, ఆదిశేషుని మొదలైనవారిని మేల్కొలుపుతుంది. 


పదహారవ పాశురము: 

ఇందులో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క భటులను మేల్కొలుపుతుంది.

నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
 నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మణులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము. గోప బాలికలైన మాకు మాయావియు, మణివర్ణుడును అగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు ‘పఱ’ యను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాటయిచ్చెను.మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చిన వారము కాదు. పరిశుద్ధ భావముతో శ్రీకృష్ణుడిని మేల్కొలుపుటకు వచ్చితిమి. స్వామీ! నీవు ముందుగానే కాదనకుము.  తలుపులు తెరచి మమ్మల్ని లోనికి పోనీయవలెను అని గోపికలు భవన పాలకుని, ద్వారపాలకుని అర్థించిరి. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

పదియేడవ పాశురము: 

ఇందులో ఆమె నందగోపుని, యశోదా అమ్మను, బలరాముడిని మేల్కొలుపుచున్నది.

అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!
అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద
ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్.

వస్త్రములు, అన్నము, నీళ్ళను ధర్మము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము. ఓ సుకుమారమైన శరీరములు గల గోపికలకు నాయకురాలా! మా వంశమునకు మంగళదీపము వంటిదానా! మా స్వామినీ! యశోదా! మేల్కొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చికొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా! నీవు నిద్రనుండి మెల్కోవాలి. స్వఛ్చమైన ఎఱ్ఱని బంగారముతో చేయబడిన కడియము కాలిన దాల్చిన బలరామా! నీవునూ, నీ తమ్ముడును ఇద్దరూ మీ దివ్య నిద్ర నుండి మెల్కోవలెను.

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

పద్దెనిమిదవ, పంతొమ్మిదవ మరియు ఇరవైయవ పాశురములలో: శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొలిపే విధానములో ఎదో లోపం ఉందని ఆండాళ్ భావించి, నీలాదేవి యొక్క సిఫార్సుతో చేయలేదని గ్రహిస్తుంది. ఈ మూడు పాశురములలో నీలాదేవి ని, శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుబంధాన్ని, దివ్య రూపాన్ని, నిత్య యవ్వనాన్ని, పరమాత్మ యొక్క ప్రియురాలిగా ఆమె పురుషాకారాన్ని కీర్తించింది. కేవలము పరమాత్మను కోరుకొని దేవేరిని మరచిపోవుటను మన పూర్వాచార్యులు శూర్పణఖ తో పోల్చారు. అలాగే పరమాత్మను మరచి కేవలము దేవేరిని ఆశించడాన్ని రావణునితో పోల్చారు. 


పద్దెనిమిదవ పాశురము: 

ఎంత ప్రయత్నించినా శ్రీ కృష్ణుడు మేలుకోక పోయేటప్పటికి, ఆండాళ్ నీలాదేవి యొక్క సిఫార్సుతో  వారిని మేల్కొలిపే ప్రయత్నము చేస్తుంది. శ్రీ రామానుజులకు అతి ప్రియమైన పాశురమిది.

ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్
నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !
కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్
వన్దెజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్
పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ
చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వన్దు తిరువాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్.

ఏనుగులతో పోరాడగలిగిన వాడును,మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజ బలము గలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లుచున్న కేశ పాశముగల ఓ నీలాదేవి! తలుపు గడియ తెరవుము. కోళ్ళు అంతట చేరి అరచు చున్నవి. మాధవీ లత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. పూబంతిని చేతిలో పట్టుకొనినదానా! నీవు సంతోషముగా లేచి వచ్చి, ఎఱ్ఱతామర పూవును బోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తెలుపు తెరవుము. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

పందొమ్మిదవ పాశురము:

ఆండాళ్ ఇందులో శ్రీకృష్ణుడిని, నీలాదేవిని మేల్కొలుపుతుంది.

కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.

గుత్తి దీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళుగల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు, వెడల్పు కలిగిన పాన్పుపై నెక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీలాదేవి యొక్క స్తనములపై గల తన శరీరమును ఆనుకుని పరుండి విశాలమైన వక్షఃస్థలము గల శ్రీ కృష్ణా నోరు  తెరచి మాటాడుము. కాటుక పెట్టుకొనిన విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి! నీవు నీ ప్రియుని ఎంత సేపు లేవ నీయవు? ఇంత మాత్రము ఎడబాటు కూడ ఓర్వలేకుండుట నీ స్వరూపానికి, నీ స్వభావమునకు తగదు. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ఇరవైయ్యవ పాశురము:

ఈ పాశురములో ఆండాళ్ తమను శ్రీ కృష్ణునితో కలిపించి వారిని అనుభవించడములో సహాయపడమని చెబుతూ  నీలాదేవిని ,శ్రీ కృష్ణుడిని మేల్కొలుపుతుంది.

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.

ముప్పది మూడు కోట్ల అమరులను వారికింకను ఆపదరాక ముందే పోయి, యుద్దభూమి లో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ! మేల్కొనుము. రక్షణము చేయు స్వభావము గలవాడా! బలము కలవాడా ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కల్గించువాడా! నిర్మలుడా! మేల్కొనుము. బంగారు కలశములను పోలిన స్తనములును, దొండపండువలె ఎఱ్ఱని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపూర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేల్కొనుము. వీచుటకు విసనకఱ్ఱను, కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము.

భగవాన్ ని అనుభవించడములో నేనూ మీతో ఉన్నాను”  అని నీలాదేవి కూడా ఆండాళ్ సమూహములో చేరుతుంది. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం


ఇరవై ఒకటవ పాశురము: 

ఇందులో, ఆమె నందగోపుని  వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను, అతని ఆధిపత్యమును మరియు వేదముల ద్వారా స్థాపించబడిన అతని గుణాలను స్తుతిస్తుంది.

ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్

పొదుగు క్రిందనుంచిన కడవలు చరచర నిండి పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు, బలసిన ఆవులుగల నందగోపుని  కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్డ్యము గల పరబ్రహ్మ స్వరూపా! ఆశ్రిత రక్షణ ప్రతిఙ్ఞాదార్డ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతి స్వరూపా! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడ నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై నీ విశాలమైన భవన ముఖ ద్వారము వద్దకు వచ్చితిమి. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ఇరవై రెండవ పాశురము: 

ఇందులో తనకూ తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదనిశ్రీ రామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్లే వారూ అతని వద్దకు వచ్చారని ఆండాళ్ శ్రీమన్నారాయణుని  కి విన్నవించుకుంటుంది. అన్ని కోరికలు వదులుకొని, కేవలము వారి అనుగ్రహమే ఆశించి వచ్చామని తెలియజేస్తుంది.


అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.

సుందరము విశాలము నగు మాహా పృధివీ మండలము నంతను ఏలిన రాజులు తమ కంటె గొప్పవారు లేరనే అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు, మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామర పువ్వువలె వాత్సల్యముచే ఎఱ్ఱగా ఉన్న నీ కన్నులను మెల్ల మెల్లాగా విచ్చి మాపై ప్రసరింపజేయుము. సూర్యచంద్రు లిరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించునట్లుండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా! మేము అనుభవించియే తీరవలెనని శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ఇరవై మూడవ పాశురము:  

ఇందులోచాలా కాలము ఆండాళ్ని వేచి ఉంచిన తరువాతశ్రీ కృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటో అడుగుతారు. దానికి బదులుగా ఆమె శ్రీ క్రిష్ణుడిని ఒక రారాజు లాగా తన సింహాసనము వద్దకు నడిచి వచ్చి సభలో అందరి సమక్షములో ఈ ప్రశ్న అడగమని చెబుతుంది.

మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్
శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే ఫోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

పర్వతగుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యముగల సింహము మేల్కొని, తీక్ష్ణమగు చూపులతో ఇటు అటుచూచి, ఒక విధమగు వాసనగల తన ఒంటి వెండ్రుకలు నిగుడునట్లు చేసి, అన్ని వైపులకు దొర్లి, దులుపుకొని, వెనుకకు ముందుకు శరీరమును చాపి, గర్జించి, గుహనుండి బయటికి వచ్చునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటికి వేంచేసి రమణీయ సన్నివేశముగల లోకోత్తరమగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ఇరవై నాలుగవ పాశురము: 

తాను ఆసీనుడైన తరువాత, ఆమె అతనికి మంగళాశాసనము చేయటం ప్రారంభిస్తుంది.  పరమాత్మకు మంగళాసాసనము చేయడమే పెరియాళ్వార్ యొక్క ముద్దు బిడ్డ అయిన ఆండాళ్ యొక్క లక్ష్యము. అతని నడకను చూసి ఆండాళ్ మరియు ఆమె స్నేహిస్తులు సీతమ్మ లాగా, దండకారణ్యములోని మునులులాగా, పెరియాళ్వార్ మాదిరిగా మంగళాశాసనము గావిస్తారు. లేత పాదాలు గలిగిన శ్రీకృష్ణ పరమాత్మను నడిపించామే నని వారు బాధ చెందుతారు.

అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్.


 “పోత్తి” అన్న పదము “చిరకాలము వర్ధిల్లు” అని మంగళాశాసనమును సూచిస్తుంది. ఆనాడు దేవతల కోసము ముల్లోకాలను కొలిచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. సుందరమైన  లంకకి వెళ్లి రావణుడిని చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. శ్రీ కృష్ణునకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ ప్రతిమ కీర్తికి మంగళము. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపై నావేశించిన అసురుని చంపుటకై రాయిని విసినట్లుగా వెలగ చెట్టుపైకి  దూడను విసురునపుడు ముందు వెనకకు పాదములుంచి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళము. గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పెకలించి విజయము నార్జించి ఇచ్చెడి మీ హస్తము నందలి వేలాయుధమునకు  మంగళము. ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములనే కీర్తించి పఱ అనే వ్రతసాధనము నందున మేమీనాడు వచ్చినారము అనుగ్రహింపుము. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

 

ఇరవై ఐదవ పాశురము: 

వారి నోమును కొనసాగించికోవడానికి తమకు ఏదైనా అవసరమా అని శ్రీమన్నారాయణుడు  వారిని అడిగినప్పుడువారు తనకు మంగళాశాసనము చేసిన తరువాత వారి బాధలన్నీ మటు మాయమయ్యాయనివారు ఇక కోరుకునేది ఒక్క కైంకర్యమేనని వారు విన్నపిస్తారు.

ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్.

సాటిలేని దేవకీ దేవికి కుమారునిగా జన్మించి, శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించిన అద్వితీయ వైభవము గల యశోదకు కుమారుడివై దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము గలవాడా! నిన్నే కోరి వచ్చినవారము.పఱయను వాద్యమునిచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ఇరవై ఆరవ పాశురము: 

దీనిలో, ఆమె అతనికి నోముకి అవసరమైన ఉపకరణాలు గురించి వివరిస్తుంది. ఇంతకు ముందు ఏమీ అవసరం లేదని ఆమె చెప్పినప్పటికీ, ఆమె ఇప్పుడు మంగళాశాసనము చేయడానికి పాంచజన్యమును, అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడటానికి దీపము, దివ్య పతాకముపందిరి మొదలైన ఉపకరణాలను కోరుతుంది. తన కృష్ణానుభవానికి సంపూర్ణతకై ఆండాళ్ వీటిని కోరుతున్నట్లు మన పుర్వచార్యులు వివరిస్తున్నారు.

మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.

ఆశ్రిత వ్యామోహము కలవాడా! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్థ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరము లర్థించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్యులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదము. ఈ భూమండల మంతను వణకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన, నీ పాంచజన్యమనెడి శంఖమును బోలిన శంఖములు కావలెను. పెద్ద ‘పఱ’ యను వాద్యములు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ  దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృప చేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్థించిరి. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ఇరవై ఏడవ పాశురము: 

తన వైపు అనుకూల ప్రతికూలమైన తత్వాలను కూడా ఆకర్షించగల శ్రీమన్నారాయణుడు  యొక్క ప్రత్యేకమైన గుణాన్ని ఆండాళ్ వివరిస్తుంది. అంతే కాకుండా, అతని నుండి విడనాడకుండా నిరంతరము కైంకర్యము చేయగల సాయుజ్య మోక్షము అత్యున్నత పురుషార్థమని ఆమె తెలియజేస్తుంది. ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది పాశురములలో శ్రీమన్నారాయణుడు మాత్రమే మనకు లక్ష్యము మరియు వారిని చేరగలిగే సాధనము కూడా అని ఆమె ధృవీకరిస్తుంది.

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్

తనతో కూడని శత్రువులను జయించెడి కళ్యాణ గుణ సంపద గల గోవిందా! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పఱ యను వాద్యమును పొంది పొందదలచిన ఘనసన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి క్రింద భాగమున దాల్చెడి దుద్దు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణపూవులు, కాలియందెలు మొదలగు అనేకాభరణములను మేము దాల్పవలయును. తరువాత మంచి చీరలను దాల్పవలయును. దాని తరువాత పాలు అన్నము మునునట్లు నేయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలెను – అని గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నపించిరి. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ఇరవై ఎనిమిదవ పాశురము: 

దీనిలో, అన్ని ఆత్మలకూ పరమాత్మకు మధ్య కారణ రహిత సంబంధమును, ఏ ఇతర మార్గాలనూ ఆమె అనిసరించలేదని, శ్రీమన్నారాయణుడు యొక్క గొప్పతనాన్ని, ప్రతిఫలంగా ఏమీ ఆశించక ప్రతి ఒక్కరినీ ఉద్ధరించే అతని గుణాన్ని ఆమె వివరిస్తుంది.

క ఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్,
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.

పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించియుండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడి వారము. ఏమియు జ్ఞానము లేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకు ఎన్ని లోపములున్ననూ తీర్చగల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోక మర్యాద ఎరుగని పిల్లలము. ఇందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములను అనుగ్రహింపక యుండకుము. మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ఇరవై తొమ్మిదవ పాశురము:

కైంకర్యము చేయడం మన ఆనందం కోసం కాదని, అది అతని ఆనందం కోసం మాత్రమే అని ఇక్కడ ఆమె ఒక ముఖ్యమైన సూత్రాన్ని వెల్లడిస్తుంది. ఇంకా, ఆమె కృష్ణానుభవముపై తనకున్న అగాఢ కోరిక కారణంగా, ఈ నోమును కేవలం తానొక సాకుగా ఆచరిస్తుందని ఆమె తెలిజేస్తుంచి.

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్

బాగుగా తెల్లవారకమునుపే నీవున్నచోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపూవుల వలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ప్రయోజనమును వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీ నుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని, ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలేవియూ లేకుండునట్లు చేయుము. 

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

 

ముప్పైయవ  పాశురము:  

పరమాత్మ తన కోరికలను నెరవేరుస్తానని ఆశ్వాసమునిచ్చినందున, ఆమె పరమానందముతో  ఈ పాశురమును పాడింది. ఈ పాశురములను ఎవరు పాడినా, తాననుసరించినంత స్వచ్చమైన మనస్సుతో చేయక పోయినా ఆమె సాధించిన కైంకర్యము వారూ పొందుదురని ఆమె ధృవీకరించినది. మరో మాటలో చెప్పాలంటే, వ్రేవల్లెలో శ్రీ కృష్ణునితో సహ జీవనము చేసిన గొల్ల భామలకు అతనిపై ప్రగాఢ ప్రేముండేది.

శ్రీవిల్లిపుత్తుర్లో అదే గోపికల మనోస్థితితో ఉన్న ఆండాళ్, ఈ పాశురములను నేర్చుకొని పాడిన వారెవరైన సరే అదే ప్రయోజనాన్ని పొందుతారు. దూడ చచ్చినా గడ్డితో నింపిన ఆ దూడ ప్రతిమను జూచి ఆవు పాలెలా ఇచ్చునో అలాగే పరమాత్మకు ప్రియమైన ఈ పాశురములు పాడిన వారికి పరమాత్మకు ప్రియమైన వారు పొందే ప్రయోజనము వారూ పొందుతారు అని తెలియజేస్తున్నారు.

క్షీర మహాసముద్రమును చిలికిన సంఘటనను వివరిస్తూ అండాళ్ ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది. ఎందుకంటే, గోప బాలికలు పరమాత్మను పొందాలనుకున్నారు. పరమాత్మను పొందాలంటే లక్ష్మి దేవి  యొక్క పురుషాకారము అవసరము. సముద్రము నుండి లక్ష్మి దేవిని పొంది వివాహమాడాలనే  ఉద్దేశ్యముతో పరమాత్మ సముద్ర మథనము చేసిరి. 

కావున అండాళ్ కూడా ఈ సంఘటనను ప్రస్తావించి ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది. ఆచార్యాభిమాన స్థితిలో ఉన్న  అండాళ్ పెరియాళ్వార్ కుమార్తె అని చూపించి ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది.

వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్

ఓడలతో నిండియున్న క్షీర సముద్రమును మథింపజేసి లక్ష్మీ దేవిని పొంది మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణాభరణములను దాల్చిన వారును అగు గోపికలు చేరి, మంగళము పాడి, పఱ యను వాద్యమును  లోకుల కొరకును, భగద్దాస్యమును తమకొరకును పొందిరి. ఆ ప్రకారమునంతను, లోకమునకు ఆభరణమైయున్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రిక యగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురములతో మాలికగా కూర్చినది. ఎవరు ఈ ముప్పది పాశురములను క్రమము తప్ప కుండా చదువుదురో, వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతము నాచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు.

కేవలము అధ్యయనము చేయుటచేతనే, పుండరీకాక్షుడును, పర్వత శిఖరముల వంటి బాహు శిరస్సులు గలవాడును శ్రీవల్లభుడును, చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును.


 శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)